జూరాలపై టెన్షన్! ..రెండు కెనాల్స్‌‌ ద్వారా నీటి విడుదలకు రైతుల డిమాండ్

జూరాలపై టెన్షన్! ..రెండు కెనాల్స్‌‌ ద్వారా నీటి విడుదలకు రైతుల డిమాండ్
  • జూరాల డ్యామ్‌‌తోపాటు గద్వాల - ఎర్రవల్లి మెయిన్​రోడ్డుపై బైఠాయింపు
  • 9 టీఎంసీల నీళ్లున్నా రిలీజ్‌‌ చేయరా? అని బీఆర్ఎస్‌‌ నేతల ఆందోళన

గద్వాల/మహబూబ్‌‌నగర్‌‌/మరికల్‌‌/వనపర్తి, వెలుగు: జూరాల ప్రాజెక్టు దగ్గర టెన్షన్ నెలకొన్నది. ప్రాజెక్టు లెఫ్ట్,  రైట్ కెనాల్స్ ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం రోడ్డెక్కారు. జూరాల డ్యామ్‌‌తో పాటు గద్వాల, ఎర్రవల్లి మెయిన్​రోడ్డు మీద జమ్మిచేడు దగ్గర  బైఠాయించారు. ఆ రోడ్లను దిగ్బంధించారు. జూరాల ప్రాజెక్టుకు వరద రావడంతో  రెండు నెలలపాటు కాలువలకు నీటిని విడుదల చేశారని,  దాంతో తాము వరి  సాగు చేశామని  చెప్పారు.

2 నెలలు నీళ్లిచ్చి  అకస్మాత్తుగా  నిలిపివేయడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. నీటిని అసలే విడుదల చేయకుంటే పంటలు వేసేవాళ్లమే కాదని, ఇప్పుడు  పంటలను  కాపాడుకునేందుకు తప్పనిసరై రోడ్డు ఎక్కాల్సి వచ్చిందన్నారు.  పంట కాలువలకు నీళ్లిచ్చేదాకా ఆందోళన  విరమించేది  లేదని తేల్చి చెప్పారు.

రైతులతో మాట్లాడేందుకు అక్కడికి చేరుకున్న అడిషనల్ కలెక్టర్ మధు మోహన్‌‌ను ఓ మహిళా రైతు ‘నీళ్లివ్వండి సార్‌‌’‌‌​అంటూ  కాళ్లు పట్టుకొని ప్రాధేయపడింది. రైతులకు బీఆర్‌‌‌‌ఎస్​, బీజేపీ నేతలు మద్దతిచ్చారు. రైతులతోపాటు ఆందోళనలో పాల్గొనేందుకు సిద్ధమైన ప్రతిపక్ష నేతలను పోలీసులు హౌస్‌‌ అరెస్ట్‌‌ చేశారు.  

ఐదున్నర గంటలపాటు ఆందోళన

రైతుల ఆందోళన ఉదయం నుంచి దాదాపు ఐదు గంటలపాటు కొనసాగింది. రైతులు రోడ్లను దిగ్బంధించడంతో కిలోమీటర్ల  వరకు  వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్​ జామ్‌‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఎర్రవల్లి, వనపర్తి కర్నూల్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఆర్టీసీ తాత్కాలికంగా రద్దు చేసింది.  ఎంతకూ రైతులు ఆందోళన విరమించకపోవడంతో  జూరాల లెఫ్ట్ కెనాల్ దగ్గర  పోలీసులు వారిని చెదరగొట్టారు.

దీంతో రైతులు లెఫ్ట్ కెనాల్‌‌లోకి దిగి నిరసన వ్యక్తం చేశారు.  రోడ్డుపై వేసిన ముళ్లకంపలను పోలీసులు తొలగించి.. రాకపోకలను పునరుద్ధరించారు.  అడిషనల్​కలెక్టర్ మధుమోహన్, జూరాల ప్రాజెక్టు ఎస్‌‌ఈ కేశవరావు రైతులతో మాట్లాడారు.  సాగునీటి విడుదలపై ప్రభుత్వం, అధికారులతో చర్చిస్తున్నామని, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కావాలన్నారు.

 వారి హామీ మేరకు ధర్నా విరమించిన రైతులు 24 గంటల్లోగా నీళ్లివ్వకపోతే మళ్లీ రోడ్డెక్కుతామని  హెచ్చరించారు. జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసే గేట్ల దగ్గర పోలీస్ పహారా  కొనసాగుతున్నది.  రైతులే నీటిని విడుదల చేసుకుంటారనే అనుమానంతో  రెండు రోజుల నుంచి జూరాల ప్రాజెక్టు దగ్గర పోలీసులు మోహరించారు.

పొలాలకు నీళ్లు ఇవ్వాల్సిందే: మాజీ మంత్రులు 

పంటలకు నీటిని విడుదల చేయాలని జూరాల వద్ద ధర్నాకు బీఆర్‌‌ఎస్‌‌ పిలుపునిచ్చింది. దీంతో ఆందోళనకు సిద్ధమైన బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మహబూబ్‌‌నగర్‌‌  తిరుమల హిల్స్‌‌లోని నివాసంలో మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డిని, భూత్పూర్‌‌ మండలం అన్నసాగర్‌‌ గ్రామంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌‌రెడ్డిని హౌస్‌‌ అరెస్ట్‌‌ చేశారు.  ప్రస్తుతం జూరాలలో 8.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని, అయినా సాగునీటిని ఎందుకు విడుదల చేయడం లేదని లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. తాగునీటి కోసం నీరు నిల్వ ఉంచామని చెబుతున్న ప్రభుత్వం.. సాగులో ఉన్న వరి పంటల పరిస్థితిపై సమాధానం చెప్పాలన్నారు.  

ఫామ్‌‌హౌస్​లో నిరంజన్‌‌రెడ్డి అడ్డగింత

జూరాల ముట్టడికి వెళ్లేందుకు సిద్ధమైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌‌రెడ్డిని ఆయన ఫామ్‌‌హౌస్‌‌లో పోలీసులు అడ్డగించారు. అక్కడినుంచి  వనపర్తిలోని ఇంటికి తరలించి గృహ నిర్బంధం చేశారు. తెల్లవారుజాము నుంచే బీఆర్‌‌ఎస్‌‌ నాయకులను వారి ఇళ్ల వద్ద అరెస్ట్‌‌ చేసి పోలీస్‌‌స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా నిరంజన్‌‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీళ్లున్నాయని, తాగునీటి అవసరాలకు 1.05 టీఎంసీల నీళ్లు మాత్రమే అవసరమని తెలిపారు.

9 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచి రైతుల సాగుకు నీళ్లు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. శ్రీశైలం జలాలు 670 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు తరలుతున్నాయని, ఆంధ్రా ప్రయోజనాల కోసం రేవంత్‌‌ తాపత్రయపడుతున్నారని నిరంజన్‌‌రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా ఏపీ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌‌కు సంబంధం లేని ప్రాంతాలకు సాగునీరు తరలిస్తోందని, కృష్ణా నది పక్కనే ఉన్నా చెరువులను మాత్రం తెలంగాణ ప్రభుత్వం నింపడం లేదని అన్నారు.  కాగా, జూరాల  వద్దకు వెళ్తారన్న అనుమానంతో  బీఆర్ఎస్​మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.